మనం తరచూ సినిమా సెలబ్రిటీల ఎఫైర్ల గురించి చదువుతుంటాం, వింటుంటాం. అయితే ఆ ఎఫైర్ల ప్రచారం ఆ సెలబ్రిటీలపై ఎలాంటి మానసిక, భావోద్వేగ ప్రభావానికి కారణమవుతుందనే సంగతి మనం ఏమాత్రం పట్టించుకోం. 2006లో తమపై ఈ తరహా రూమర్స్ రావడంతో ఇద్దరు సెలబ్రిటీలు ఇలాంటి భావోద్వేగ స్థితికి గురయ్యారు. వారు.. జూనియర్ ఎన్టీఆర్, సమీరా రెడ్డి. ఆ ఇద్దరూ జంటగా 'నరసింహుడు', 'అశోక్' చిత్రాల్లో నటించారు. ఎట్లా వచ్చిందో, ఎవరు పుట్టించారో తెలీదు కానీ, ఆ ఇద్దరి మధ్యా స్నేహాన్ని మించిన బంధం బలపడిందంటూ వదంతులు వెల్లువెత్తాయి.
కొన్నేళ్ల తర్వాత, తానెందుకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని వదిలేసిందో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది సమీరా రెడ్డి. అప్పటి తను ఎదుర్కొన్న పరిస్థితిని తెలియజేస్తూ కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను ఆమె బయటపెట్టింది. "నిజమేమంటే నేను చాలా ఫ్రెండ్లీగా ఉండే ముక్కుసూటి మనిషిని. దేన్నీ దాచడానికి ప్రయత్నించను. అతను చాలా వండర్‌ఫుల్ కో-స్టార్. అతనితో పనిచేయడం ఎవరికైనా సౌకర్యంగా ఉంటుంది. అతను నాకు చాలా విషయాలు నేర్పించాడు. నేను తెలుగు అమ్మాయినైనా, తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టినప్పుడు ఇక్కడి విషయాలేవీ నాకు తెలీదు. మా గురించి వదంతులు పుట్టేసరికి మా ఫ్యామిలీ అప్సెట్ అయ్యింది. అప్పటికే నేను చాలా సినిమాల్లో నటించినా, చివరకు నేను మా నాన్నకు సమాధానం చెప్పుకోవాలి. అలాగే అతను కూడా తన కుటుంబానికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి" అని చెప్పింది సమీరా.
జూనియర్ ఎన్టీఆర్‌తో లింకప్ రూమర్స్ తన ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడంతో ఈ ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోవాలనీ, అలాగే తమ ఫ్రెండ్‌షిప్‌ను కూడా వదులుకోవాలనీ ఆమె నిర్ణయించుకుంది. "జనం ఎక్కువగా మాగురించి మాట్లాడుతుండటంతో తెలుగు సినిమా నుంచి దూరంగా వెళ్లాలని నిర్ణయించుకున్నాను. ఆమెను అతను పెళ్లి చేసుకోబోతున్నాడా? అతడ్ని మీరు పెళ్లాడబోతున్నారా? ఇలాంటివి తరచూ ఎదురయ్యేవి. అభిమానులు చాలా విషయాలు చెప్పేవారు. జనం మా గురించే మాట్లాడుకొనేవారు. వాళ్లు మా సినిమాల గురించి మాట్లాడుకొనేవాళ్లు కాదు. వాళ్లు నా సామర్థ్యం గురించి మాట్లాడుకొనేవాళ్లు కాదు. నా పేరును సమీరా రెడ్డి నుంచి సమీరా ఎన్టీఆర్ అని రాసేదాకా వెళ్లింది" అని చెప్పుకొచ్చింది సమీరా.
మొదట బాలీవుడ్‌లో నటించి, 'నరసింహుడు' సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన సమీరా.. ఆ తర్వాత 'జై చిరంజీవ', 'అశోక్' సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. తారక్‌తో లింకప్ రూమర్స్‌తో తెలుగు తెరకు దూరమై, తిరిగి ఆరేళ్ల తర్వాత రానా సినిమా 'కృష్ణం వందే జగద్గురుమ్' సినిమాలో స్పెషల్ సాంగ్‌లో దర్శనమిచ్చింది. వివాహానంతరం పూర్తిగా సినిమాలకు స్వస్తి చెప్పేసింది.
ప్రస్తుతం ఆమె తన కుటుంబంతో చాలా హ్యాపీగా జీవితాన్ని గడుపుతోంది. 2014లో వ్యాపారవేత్త అక్షయ్ వర్దేను పెళ్లాడింది సమీరా. వారికి హన్స్ అనే కొడుకు, నైరా అనే కూతురు ఉన్నారు.